వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును, దిలీపుడు యిట్లు తెలియజేసెను. "పార్వతీ! చాలాకాలం క్రిందట, దక్షిణ ప్రాంతమందు, అసంతవాడయను నామముగల పెద్దనగరముండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్యపేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసినిగొట్టు, తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది, కాని, అతడు ఇంకనూ, ధనాశకలవాడై, తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి, మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైననూ, శ్రీహరిని ధ్యానించుటగాని, దానధర్మాలు చేయుటగాని, యెరుగడు. అంతేకాక, బీదప్రజలకు, వారి ఆస్తులపై, వడ్డీలకు ఋణాలిచ్చి, ఆ అనుకున్న గడువుకు, ఋణం తీర్చనందున, తప్పుడు సాక్ష్యాలతో, వ్యాజ్యములు వేసి, వారి ఆస్తులు సైతము స్వాధీన పరచుకొనేవాడు. ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను, ఆ రొజు సాయంత్రం, ఒక ముదుసలి బ్రాహ్మణుడు, బంగారుశెట్టి భార్యను చూచి, "తల్లీ! నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న, యింకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది, ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద, రాత్రి గడుపనిమ్ము. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్భ్రాహ్మణుడను, సదాచారవ్రతుడను. ప్రాతఃకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయెదను" అని బ్రతిమలాడెను.
తాయారమ్మకు జాలికలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి, అందొక తుంగచాపవేసి, కప్పుకొనుటకు వస్త్రమిచ్చి, పండుకొనుడని పలికెను. ఆమె దయార్ర్ద హృదయమునకుo ఆ వృద్ద బ్రాహ్మణుడు సంతసించి, విశ్రాంతి తీసుకొనుచుండగా, తాయారమ్మ ఒక ఫలమునిచ్చి, దానిని భుజింపుమని చెప్పి, "ఆర్యా! మాఘస్నానము చేసి వెళ్ళెదనని యన్నారు కదా! ఆ మాఘస్నానమేమి? సెలవిండు. వినుటకు కుతూహలముగా నున్నది" అని అడుగగా, నా వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటికప్పుకొని, "అమ్మా! మాఘమాసము గురించి చెప్పుట, నాశక్యము కాదు, ఈ మాఘమాసములో నది యందు గాని, తటాకమందు గాని, లేక నూతియందుగాని, సూర్యోదయము అయిన తర్వాత, చన్నీళ్ళు స్నానము చేసి, విష్ణుమందిరానికి వెళ్ళి, తులసి దళముతోను, పూలతోను, పూజ చేసి, స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను, తరువాత, మాఘపురాణము పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడువకుండా, నెలరోజులు చేసి, ఆఖరున బ్రాహ్మణ సమారాధన, దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసినయెడల, మానవుని, రౌరవాది నరక విశేషములలో పడవేయు, అశేష మహాపాపములు, వెంటనే నశించిపోవును. ఒకవేళ, ఈ నెలరోజులూ చేయలేనివారూ, వృద్దులూ, రోగులు, ఒక్కరోజయినను అనగా ఏకాదశినాడు గాని, ద్వాదశినాడు గాని, లేక పౌర్ణమినాడు గాని, పై ప్రకారము చేసినచో, సకలపాపములు తొలగి, సిరిసంపదలు, పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను" అని చెప్పగా, ఆ బ్రాహ్మణుని మాటలకు, తాయారమ్మ, మిక్కిలి సంతసించి, తాను కూడ, ప్రాతఃకాలమున, బ్రాహ్మణునితో బాటు నదికిపోయి, స్నానము జేయుటకు నిశ్చయించుకొనెనుl.
అంతలో, పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి యింటికిరాగా, ఆమె అతనికి, మాఘమాసము గురించి చెప్పి, తాను తెల్లవారుజామున, స్నానమునకు పోదునని, తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు, బంగారుశెట్టికి కోపమువచ్చి, వంటినిండా మంటలు బయలదేరినట్టుగా పళ్ళు పటపటాకొరికి, "ఓసీ వెర్రిదానా! ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి? స్నానమేమిటి? వ్రతము, దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు. అధిక ప్రసంగముచేసినచో, నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో, పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికిని, ఒక్కపైసాకూడా వదలకుండా, వడ్డీలు వసూలుచేస్తూ, కూడబెట్టిన ధనమును, దానము చేయుదువా? చలిలో చన్నీళ్ళు స్నానముచేసి, పూజలుచేసి, దానములుచేస్తే, వళ్ళూ, యిల్లూ, గుల్లయి, నెత్తి పైన చెంగు వేసుకొని, 'భిక్షాందేహీ' అని అనవలసినదే జాగ్రత్త! వెళ్ళి పడుకో", అని కోపంగా కసిరాడు.
ఆ రాత్రి, తాయారమ్మకు నిద్రపట్టలేదు. యెప్పుడు తెల్లవారునా, యెప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా, అని, ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని, యింటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి, మగనికి చెప్పకుండ, నదికిపోయి, స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి , ఒక దుడ్డుకర్ర తీసుకొని, నదికిపోయి, నీళ్ళలోదిగి, భార్యను కొట్టబోవుచుండగా, ఆ యిద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి. అటుల మునుగుటచే, ఇద్దరికి, మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద, బంగారుశెట్టి, భార్యను కొట్టి, యింటికి తీసుకువచ్చినాడు.
కొన్ని సంవత్సరములు తరువాత, ఒకనాడు, ఇద్దరకూ ఒకవ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు, ఇద్దరూ, చనిపోవుటచే, బంగారుశెట్టిని తీసుకొనిపోవుటకు యమభటులు వచ్చి, కాలపాశము వేసి, తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసికొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి, ఆమెను రధముపై ఎక్కించుకొని, తీసికొనిపోవుచుండిరి. అపుడు తాయారమ్మ, యమభటులతో, యిట్లు పలికెను. "ఓ యమభటులారా! ఏమిటీ అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొనిపోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమేగదా" అని వారి నుద్దేశించి అడుగగా, ఓ అమ్మా! నీవు మాఘమాసములో, ఒకదినమున, నదీస్నానము చేయగా, నీకీ ఫలము దక్కినది. కానీ, నీ భర్త అనేకులను హింసించి, అన్యాయముగా ధనార్జన చేసి, అనేకులవద్ద అసత్త్యములాడి, నరకమన్న భయములేక, భగవంతునిపై భక్తిలేక, వ్యవహరించునందులకే, యమలోకమునకు, తీసుకొని పోవుచున్నాము" అని యమభటులు పలికిరి.
ఆమె మరల, వారినిట్లు ప్రశ్నించెను. "నేను ఒకే దినమున, స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు, నన్ను కొట్టుచూ, నాతో నా భర్తకూడా, నీటమునిగినాడు కదా!l శిక్షించుటలో యింత వ్యత్యాసమేల కలుగెను?" అని అనగా, ఆ యమభటులకు సంశయము కలిగి, యేమియు తోచక, చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి, జరిగిన సంగతిని, ఆమె వేసిన ప్రశ్ననూ, తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టికచూడగా, ఇద్దరకూ సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు, చిత్రగుప్తుడు విచారించి, బంగారుశెట్టిని కూడా, వైకుంఠమునకు తీసుకొని పొమ్మని, విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ, తన భర్త గతి యేమయ్యెనో యని ఆతృతతో ఉండగా, బంగారుశెట్టిని, పుష్పకవిమానము మీద తెచ్చి, వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ , మిక్కిలి సంతసమందిరి. రాజా! వింటివా! భార్యవలన భర్తకు కూడా యెటుల మోక్షము కలిగెనో, భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను, భార్యా యధాలాపముగా, ఒక్కరోజు మాఘమాసస్నానము చేసినందున, యిద్దరికిని వైకుంఠప్రాప్తి కలిగినదిగా! గనుక మాఘస్నానము, నెలరోజులు చేసినచో, మరింత మోక్షదాయకమగుననుటలో, సందేహములేదు.
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి