*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*
*ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||*
*వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |*
*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*
*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |*
*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||*
ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు , గంగాది నదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం , ఆషాడం , కార్తీకం , మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం , జపం , తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.
పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి *'స్వామీ ! స్నానానికీ , ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ , పావనమూ , సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా ! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ , అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట , ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో , ఆయన కుమారుడు సూతమహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని , విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.
ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో *సూతమహర్షి* వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి ! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు , రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.
సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి , పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి , వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత , నాకు తెలిసిన విషయాన్ని , మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సులనీ , భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను , మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు *'సూతమహర్షి లోగడ వైశాఖమాసం , కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని'* కోరారు.
అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షిసత్తములారా ! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది అయినా , యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే విషయాన్ని అడిగింది. గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.
పార్వతీదేవి పరమేశ్వరునితో *"విశ్వాత్మకా ! సర్వలోకేశ్వరా ! సర్వభూతదయానిధీ ! ప్రాణేశ్వరా ! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని"* ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు *"కళ్యాణీ ! జగన్మంగళా ! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును ? తప్పక చెప్పెదను , వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినొందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగోట్టును.
రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు , నూయి , కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా , తెలిసికాని , తెలియకకాని , బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.
మాఘస్నానమును మాని , విష్ణువునర్చింపక , దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును ? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు , నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనొందుదురు సుమా , దరిద్రులైనను , బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు , అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.
ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను , మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని , భయముచే గాని , బలవంతముగా గాని , మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని , చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను , నివారించినను మహాపాపములు కలుగును.
పార్వతీ ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని , ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని , నిందించినను , నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమునంత పుణ్యప్రదము సుమా.
దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు *'మహారాజా ! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నావేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని , సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా ? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.*
దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా ! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. మాఘమాసమున ప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములను పోగోట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమే యింత అధికమైనపుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము.
పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము(వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య - హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు , ప్రభువులు , మునులు , మహర్షులు , పశువులు , పక్షులు , సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి , అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు , కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.
ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగము వలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా ! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా ! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు , నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.
భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము , దురదృష్టము , పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము , పవిత్రక్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము , పూజ , జపము , తపము జీవికి గల పాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము , మాఘమాసములో నదిలోగాని , సముద్రములోగాని , కాలువలోగాని , సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును , తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై , మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునొంది తన భార్యలో బాటు తనలోకమున కెగెను. దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా ? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను.
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి