శ్రీమద్రామాయణము-బాలకాండ-ఏడవ సర్గ- Sri Valmiki Ramayanam in Telugu - Day -7


ఆవిధంగా అయోధ్యను పరిపాలిస్తున్న శ్రీ దశరథ మహారాజుకు సమర్థులైన అమాత్యులు ఉండేవారు. దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు. మంచి లోకజ్ఞానము, నేర్పు కలవారు. ఎల్లప్పుడూ రాజు క్షేమము కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు. నీతి మంతులు. అటువంటి మంత్రులు దశరథునికి ఎనిమిది మంది ఉండేవారు. వారి పేర్లు ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు,సుమంతుడు. 

వీరుగాక వసిష్టుడు, వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు. పైన చెప్పిన మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండే వారు. వారందరూ అన్ని విద్యలందూ నేర్పరులు. బుద్ధిమంతులు. ఇంద్రియములను నిగ్రహించినవారు. శ్రీమంతులు. గొప్పవారు. శాస్త్ర పరిజ్ఞానము కలవారు. పరాక్రమ వంతులు. కీర్తిమంతులు. కార్యశూరులు. చెప్పిన పని చేసేవారు. మంచి తేజస్సు కలవారు. క్షమాగుణము కలవారు. ఎప్పుడూ చిరునవ్వుతో మృదువుగా మాట్లాడే గుణము కలవారు. కోపంలో గానీ, కామ ప్రకోపము వలన గానీ, ధనము కోసం గానీ, అబద్ధము చెప్పరు. 

వారు గూఢ చారుల ద్వారా స్వదేశములో గానీ, పరదేశములో గానీ ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారము ఎప్పటికప్పుడు తెప్పించుకొనుచుండెడివారు. తన మంత్రులకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో దశరథుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండేవాడు. మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవాడు దశరథుడు. 

దశరథుని పాలనలో న్యాయాధికారులు స్వపర బేధము లేకుండా స్వంతకుమారులనైనా తప్పు చేస్తే తగిన దండన విధించేవారు. మంత్రులు అందరూ రాజ్య నిర్వహణకు కావలసిన ధనమును సంపాదించుటలో, రాజ్యరక్షణకు తగిన సైన్యమును సమకూర్చడంలో ఎల్లప్పుడూ నిమగమై ఉండెడి వారు. తమకు ఏ విధమైన అపకారము చేయని వాడు శత్రువైనా అతనిని హింసించేవారు కాదు. 

దశరథుని మంత్రులు వీరులు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. రాజనీతి శాస్త్రమును అధ్యయనం చేసి దాని ప్రకారము రాజ్యపాలన సాగించేవారు. దేశములో ఉన్న సాధుజనులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పన్నులు వేసి వసూలు చేసేవారు. చేసిన అపరాధమును బట్టి దండన విధించేవారు. మంత్రులందరూ తమలో తమకు బేధాభిప్రాయములు లేకుండా ఒకే తాటి మీద నిలబడి రాచ కార్యములు నిర్వర్తించేవారు. 

అటువంటి మంతుల పాలనలో ప్రజలు సుఖంగా, శాంతితో అబద్ధములు చెప్పకుండా నీతిగా జీవించేవారు. అయోధ్యలో చెడ్డవారు గానీ, పరభార్యలను కామించేవారు కానీ ఉండేవారు కాదు. 

దశరధుని మంత్రులకు తమ రాజ్యము లోనే కాదు ఇతర రాజ్యములలో కూడా గౌరవ ప్రతిష్టలు ఉండేవి. ఆ మంత్రులు ఏ ఏ సమయములలో శత్రు రాజులతో సంధి చేసుకొనవలెనో, ఏ ఏ సమయములలో యుద్ధము చేయవలెనో బాగుగా తెలిసినవారు. తమకు తెలిసిన రహస్యములను కాపాడుటలోనూ, తగిన సమయములలో సముచిత నిర్ణయములు తీసుకోడం లోనూ ఆ మంత్రులు సిద్ధహస్తులు. మంత్రులందరూ నీతి శాస్త్రమును చదివినవారు. ఎదుటి వారి మనసుకు బాధ కలగకుండా మాట్లాడటంలో నేర్పుకలవారు. 

ఇటువంటి సకలసద్గుణ సంపన్నులగు మంత్రులతో దశరధుడు రాజ్యపాలన చేయసాగాడు. దశరధుడు కూడా ఎప్పటికప్పుడు రాజ్యములో జరిగే సంగతులు గూఢచారుల ద్వారా తెలుసుకొనుచూ ప్రజలను రక్షించుటకు తగిన చర్యలు తీసుకొనుచూ, రాజ్యపాలన సాగించాడు. దశరధునకు ఎంతోమంది మిత్రరాజులు, సామంత రాజులు ఉండెడి వారు. తనకు ఎదురు తిరిగినవారిని నిర్దాక్షిణ్యంగా సంహరించెడి వాడు. అందుకే దశరధునకు శత్రువులే లేరు. సమర్థులైన మంత్రుల సాయంతో దశరథుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. 

(ఇక్కడ ఒక గమనిక. మనకు ప్రాచీన గ్రంధములలో, కధతో పాటు ఆ నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను కూడా కళ్లకు కట్టినట్టు చెప్పే వారు పూర్వపు ఋషులు. దాదాపు 5,000 ఏళ్ల క్రిందట రాయబడిన రామాయణములో ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ఎలా వివరించారో చదివారు కదా. రాజు (అంటే నేటి ముఖ్యమంత్రి, మంత్రులు (నేటి మంత్రులు) ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, వారికి ఏఏ అర్హతలు ఉండాలో, మంత్రులు ఎంత నీతిగాఉండాలో, ఎలా మాట్లాడాలో, చక్కగా వివరించారు) 

ఇది వాల్మీకి విరచిత 
రామాయణ మహాకావ్యములో 
బాలకాండలో ఏడవ సర్గ 
సంపూర్ణము.

ఈ మహా కావ్యాన్ని ప్రతీనిత్యం భాగాలుగా చేసి మీకు అందించటం జరుగుతుంది. ఏ రోజు కూడా మిస్ అవకుండా చదవాలి అనుకునేవారు పైన subscribe అనే ఆప్షన్ కనబడుతుందిగా, అక్కడ క్లిక్ చేసి మీ ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి మీ మెయిల్ కు వచ్చిన లింక్ ద్వారా కన్ఫర్మ్ చేస్తే ప్రతీ నిత్యం ఈ మహా పురాణాన్ని మీ మెయిల్ కి ఉచితంగా పంపించబడుతుంది. మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్లలో తెలియ చేయండి. దీనిని వాట్స్ ఆప్ లో మీ మిత్రులతో పంచుకోవటానికి. షేర్ మీద నొక్కినప్పుడు కాపీ లింక్ అనే దానిని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఆ లింక్ ను పంపండి. జై హింద్.

Comments

Post a Comment

ఇక్కడ మీ కామెంట్ రాయండి