అయోధ్యానగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనము చేసాడు. పండితులను పూజించాడు. అమితమైన పరాక్రమ వంతుడు. దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం. ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించే వాడు. దశరథుడు ఎన్నో యజ్ఞము లను యాగములను చేస్తాడు. రాజర్షి. దశరథుని మంచితనము మూడులోకములలో చెప్పుకొనెడి వారు. దశరథుడు తన శత్రువులకు భయంకరుడు. తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకొనే నేర్చుకలవాడు. అధిక మైన సంపదలు కలవాడు.
అన్నింటికంటే గొప్ప విషయం దశరథుడు తన ఇంద్రియములను జయించిన వాడు. జితేంద్రియుడు అని పేరు గాంచాడు. దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికెడు వాడు. అసత్యము అన్నది ఎరుగడు. పూర్వము మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారము పరిపాలన సాగించాడు దశరథుడు.
ఇంక అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు. నిత్యసంతోషులు. ఉన్నదానితో తృప్తిపడేవారు. ధర్మము తప్పని వారు.
వేదములను చదివినవారు. అత్యాశాపరులు కారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికెడి వారు. దశరధుని రాజ్యములో పేదవాడు గానీ, విద్యలేని వాడు కానీ మచ్చుకు కూడా కానరాడు. అలాగే కాముకులు, లోభులు, క్రూరులు, నాస్తికులు కూడా వెదికినా దొరకరు. అయోధ్యలోని స్త్రీలు కూడా ధర్మపరులు. మంచి శీలము, ఇంద్రియ నిగ్రహము కలవారు. నిర్మలమైన మనసుకలవారు.
అయోధ్యా నగరములో చెవులకు కుండలములు లేనివాడు, కిరీటములు లేనివాడు, పుష్పమాలలతో అలంకరించుకోనని వాడు, ప్రతిరోజూ అభ్యంగనస్తానముచేయని వాడూ .. చూద్దామన్నా కానరారు. అలాగే కడుపునిండా భోజనము చేయని వాడు కానీ, అతిధికి పెట్టకుండా తాను తినేవాడుకానీ, దానధర్మములు చేయని వాడు కానీ, ఇంద్రియ నిగ్రహము లేనివాడు కానీ అయోధ్యలో లేడు.
అయోధ్యలో దొంగలు లేరు, దొంగతనములు లేవు. ఏ వర్ణము వాడు వాడికి విధించిన పనిమాత్రమే చేసేవాడు. యజ్ఞములు, యాగములు చేసేవారు. బ్రాహ్మణులు నిత్యమూ అగ్నిహోత్రం చేసేవారు. వేదాధ్యయనము చేసేవారు. అతిథి పూజ, దానధర్మములు చేసేవారు. స్వంత భార్యతోనే సంగమించేవారు. పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూచేవారు కాదు. అత్యవసర పరిస్థితులలో తప్ప ఇతరుల నుండి దానములు స్వీకరించేవారు కాదు.
దశరధునిపాలనలో నాస్తికులు గానీ, అసత్యము పలుకుతారు కానీ, అసూయా ద్వేషములు కలవారు కానీ, అశక్తులు కానీ, విద్య నేర్చుకొనని వారు కానీ లేరు. అయోధ్యలో ఎవరికీ ఎటువంటిబాధలు ఉండేవి కావు. అందరు ప్రజలు సుఖసంతోషాలతో తులతూగుతూ ఉండేవారు. ఆడవారుకానీ, మగవారు కానీ అందరూ ఐశ్వర్యవంతులే గానీ పేదవారు లేరు.
అయోధ్యావాసులకు రాజభక్తి ఎక్కువ. అందరూ దీర్గాయుషులు. పెద్ద వారు బతికి ఉండగా చినవారు చనిపోవడం ఎరుగరు. బ్రాహ్మణ, క్షత్రియ,వైశ శూద్రులు తమ తమ వ్యక్తులను నియమం తప్పకుండా చేసుకొనే వారు.
అయోధ్యలో యోధులకు కొదవ లేదు. అందరికీ అస్త్ర విద్య, శస్త్ర విద్యా నైపుణ్యము మెండుగా ఉండేది. అయోధ్యావాసులు కాంభోజ, బాహ్లిక, దేశముల నుండి అశ్వములను తెప్పించుకొనెడి వారు. వింధ్య పర్వత ప్రాంతమునుండి ఉత్తమ జాతి ఏనుగులను దిగుమతి చేసుకొనెడి వారు. అందులో కూడా భద్రగజములు, మంద గజములు, భద్ర మంద్ర గజములు, మదగజములు మొదలగు జాతుల ఏనుగులతో అయోధ్య నిండి ఉండెడిది. అయోద్య చుట్టు రెండు యోజనముల దూరములో శత్రువు అనే వాడు లేకుండా రాజ్యపాలన సాగించాడు దశరథుడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఆరవ సర్గ
సంపూర్ణము.
ఈ మహా కావ్యాన్ని ప్రతీనిత్యం భాగాలుగా చేసి మీకు అందించటం జరుగుతుంది. ఏ రోజు కూడా మిస్ అవకుండా చదవాలి అనుకునేవారు పైన subscribe అనే ఆప్షన్ కనబడుతుందిగా, అక్కడ క్లిక్ చేసి మీ ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి మీ మెయిల్ కు వచ్చిన లింక్ ద్వారా కన్ఫర్మ్ చేస్తే ప్రతీ నిత్యం ఈ మహా పురాణాన్ని మీ మెయిల్ కి ఉచితంగా పంపించబడుతుంది. మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్లలో తెలియ చేయండి. దీనిని వాట్స్ ఆప్ లో మీ మిత్రులతో పంచుకోవటానికి. షేర్ మీద నొక్కినప్పుడు కాపీ లింక్ అనే దానిని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఆ లింక్ ను పంపండి. జై హింద్.
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి