యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఒక సంవత్సరము పట్టింది. మరలా వసంత ఋతువు వచ్చింది. దశరథుడు సంతానము కొరకు యజ్ఞము చేయుటకు యాగశాలలో ప్రవేశించాడు. పురోహితులైన వశిష్టులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. "మీరందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి." అని వారిని ప్రార్థించాడు.
“మహారాజా! మీరు కోరినట్లే జరుగుతుంది" అని బ్రాహ్మణులు ఆశీర్వదించారు.
తరువాత పురోహితుడైన వశిష్టుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తు శిల్పులను, శిల్పులను, కొయ్యపనిచేసే వారిని, మట్టిపని చేసేవారిని, వినోద కార్యక్రమములకు నటులను, నటీమణులను, గాయకులు, చారిత్రకారులను, వీటన్నిటికీ లెక్కలు కట్టుటకు గణకులను, ఇంకా ఇతర రంగములలో నిష్ణాతులను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు.
“దశరథమహారాజు గారు అశ్వమేధ యాగము చేయ సంకల్పించారు. మీరందరూ ఆ కార్యక్రమునకు తగు భవనములను, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగు ఏర్పాట్లు చేయండి యజ్ఞమునకు వచ్చువారికి భోజన సదుపాయములు వసతి సదుపాయములు చేయండి. తగినన్ని వసతి గృహములు నిర్మించండి. ఎవరికీ ఎలాంటి అసౌకర్యము కలగకుండా చూడండి. అన్ని వర్ణముల వారిని సమంగా ఆదరించండి. ఎవరి మీద కోపతాపములు చూపకండి. ఆహూతులను బాధపెట్టకండి. ఈయజ్ఞమునకు కావలసిన పనులు చేయువారికి తగిన భోజన వసతి సౌకరర్మములు కల్పించండి. వారికి తగిన పారితోషికములు ఇవ్వండి. సత్కరించండి. అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్టు చూడండి. అలక్ష్యము పనికిరాదు.” అని ఆదేశించాడు వశిష్టుడు.
పిమ్మట వశిష్టుడు మంత్రి సుమంతుని పిలిపించాడు. సుమంతా! నీవు ఈ యాగమునకు భూమండలములోని రాజులందరికీ ఆహ్వాగములు పంపించు. మిధిలాధిపది జనకుడు మనకు బంధువు. ఆయనను స్వయంగా, ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్లి తీసుకొని రా, ఇంకా మహారాజు గారి మామగారు కేకయ దేశాధి పతి కేకయ రాజును కూడా స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాధీశుడు రోమపాదుని కూడా సాదరంగా ఆహ్వానించు. ఇంకా తూర్పుదేశపు రాజులను, దక్షిణదేశపు రాజులను, సింధు, సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు. మన రాజ్యముతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు. పైన చెప్పిన వారందరినీ సకుటుంబ, సపరివార సమేతముగా యజ్ఞమునకు రమ్మని ఆహ్వానించు." అని పలికాడు వశిష్టుడు.
వశిష్టుని ఆదేశానుసారము సుమంతుడు జనకుని, కేకయరాజును, కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి త్వరితముగా వెళ్లాడు. ఆయాకార్యములకు నియమింపబడిన కార్యనిర్వాహకులు, ఆయాపనులలో నిష్ణాతులైన పనివారు ఆయా కార్యములు చేయుటలో పూర్తిగా నిమగమైనారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. యజ్ఞమునకు ఆహ్వానము అందుకొన్న రాజులందరూ వారి వారికి తోచిన రత్నములు, మణులు మొదలగు కానుకలతో అయోధ్యా నగరానికి వచ్చారు. వసిష్టుడు వారందరికీ అతిధి సత్కారములకు చేయుటకు తగిన ఏర్పాట్లు చేసాడు. ఆ విషయము దశరథునికి చెప్తాడు.
వశిష్టుడు, ఋష్యశృంగుడు దశరథమహారాజు వద్దకు పోయి “ఓ దశరథమహారాజా! మనము ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మీరు యజ్ఞ శాలకు రావాలి" అని పలికారు.
ఒక శుభముహూర్తమున దశరథమహారాజు, తన ముగ్గురు భార్యలతో సహా యజ్ఞశాలకు వచ్చాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యములో, వసిష్టుని పౌరోహిత్యములో అశ్వమేధయాగము ప్రారంభము అయింది.
శ్రీమద్రామాయణము
బాలకాండ
పదమూడవ సర్గ
సంపూర్ణం
నేటి ప్రశ్న: దశరథమహారాజు యజ్ఞ శాలకు రావాలి అని పిలిచినవారు ఎవరు ?
A) కాశి రాజు
B) కేకయ రాజు
C) సింధు, సౌరాష్ట్ర దేశాధీశులు
D) వశిష్టుడు, ఋష్యశృంగుడు
సరైన సమాధానాన్ని (ఆప్షన్ న్ని) క్రింది కామెంట్లలో రాయండి. విలువైన బహుమతులు గెలుచుకొండి.
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి