“ఓ దశరథమహారాజా! తమరి గురించి సనత్కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి.
'రాబోవు కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు, శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు. ఆయనకు పుత్రసంతాగము కలుగదు. రోమపాదుడు దశరథునకు మిత్రుడు. దశరథుడు రోమపాదుని వద్దకు వెళ్లి ఋశ్యశృంగుని అయోధ్యకు పంపమని, తనకు పుత్రసంతానము కలిగేట్టు ఒకయాగం చేయించమని అర్థిస్తాడు. దానికి రోమపాదుడు అంగీకరిస్తాడు. రోమపాదుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపుతాడు. తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు యజ్ఞము చేయించమని దశరథుడు ఋష్యశృంగుని ప్రార్థిస్తాడు. ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞము చేయిస్తాడు. ఫలితంగా దశరథునకు అమిత పరాక్రమవంతులు, వంశోద్ధారకులు అయిన నలుగురు పుత్రులు కలుగుతారు.' అని సనత్కుమారుడు చెప్పగా నేను విన్నాను.
కాబట్టి ఓ దశరథ మహారాజా! ఆ మహాఋషి మాటలు తప్పవు.
నీవు వెంటనే అంగదేశమునకు స్వయముగా పోయి ఋష్యశృంగుని తీసుకొని రమ్ము, యజ్ఞము చేయింపుము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది.” అని సుమంతుడు చెప్తాడు.
ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. పురోహితుడైన వశిష్టుని అనుమతి తీసుకున్నాడు. తన మంత్రులతో సహా అంగదేశము నకు వెళ్లాడు. అంగరాజు దశరథుని సాదరంగా ఆహ్వానించాడు. అతిధి సత్కారములు చేసాడు. అంగరాజు పక్కన అగ్గి వలె ప్రకాశించు చున్న ఋష్యశృంగుని చూచాడు దశరథుడు. రోమపాదుడు దశరథుని ఋష్యశృంగునికి పరిచయం చేసాడు. ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు.
దశరథుడు అంగరాజ్యములో ఏడురోజులు ఉన్నాడు. ఎనిమిదవ రోజున తాను వచ్చిన పని తెలిపాడు.
“ఓ అంగరాజా! నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. ఆ యజ్ఞమునకు నీ కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపవలసింది." అని ప్రార్థించాడు. దానికి అంగరాజు అంగీకరించాడు.
ఋష్యశృంగుడు సతీసమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు. తమ రాకను దశరథుడు ముందుగానే అయోధ్యావాసులకు తెలియజేసాడు. స్వాగత సత్కారములు ఘనంగా చేయమని ఆదేశించాడు.
దశరధుడు ఋష్యశృంగుని తీసుకొని అయోధ్యా నగరము ప్రవేశించాడు. అయోధ్యాపురవాసులు వారికి మంగళవాద్యములతో ఘనస్వాగతం పలికారు. శాంతను చూచి అంతఃపుర స్త్రీలు ఎంతో సంతోషించారు. ఆమెను సాదరంగా ఆహ్వానించారు. శాంతా ఋష్యశృంగులు అయోధ్యలో కొంతకాలము ఉన్నారు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో
పదకొండవసర్గ సంపూర్ణము.
ప్రశ్న: దశరథుడు ఎవరియోక్క అనుమతి తీసుకొని అంగరాజ్యము బయలుదేరాడు ?
A) వాల్మికి
B) వశిష్టుడు
C) వామదేవుడు
D) సనత్కుమారుడు
సరైన సమాధానాన్ని (ఆప్షన్ న్ని) క్రింది కామెంట్లలో రాయండి. విలువైన బహుమతులు గెలుచుకొండి.
Answer : B
ReplyDelete